Saturday, March 15, 2014

జంతర్ మంతర్ దగ్గరన్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ కి ఇటీవల వెళ్ళడం జరిగింది.ఒకప్పుడు జైపూర్ పాలకుడు జైసింగ్ నిర్మించిన ఖగోళ శాస్త్రానికి చెందిన కట్టడాలకి ఆ పేరు ఉండగా,వాటి గోడని ఆనుకొని ఉన్న వీధిలో ఇప్పటి జంతర్ మంతర్ కార్యక్రమాలు అంటే రకరకాల ధర్నాలు,నిరసనలు జరుగుతుంటాయి.రాజకీయ పార్టీలు అయితేనేమి ,ఇతర ప్రజా సంఘాల వారయితేనేమి తమ డిమాండ్లని దేశవ్యాప్తంగా వినిపించడానికి దేశ అధికారకేంద్రమైన ఢిల్లీలో వినిపించడానికి ఈ ప్రదేశాన్ని వేదికగా చేసుకొని తమ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు.ఈ జంతర్ మంతర్ వీధిలో అటు ఇటు టెంట్లు వేసి తమ ఉపన్యాసాలను,స్లోగన్లను వినిపిస్తుంటారు.ఫిబ్రవరి 25 న ఈ ప్రదేశానికి వెళ్ళినపుడు ఒక పెద్ద సంత మాదిరిగా తోచింది.

ఆ చివరినుంచి ఈ చివరిదాకా పెద్ద చెట్లు ఉండటం మూలాన వాతావరణం చల్లగా ఉన్నది.ఎలాగు హిమాలయలకి మనకంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి ఢిల్లీ మనంత వేడిగా ఉండదు.రోడ్డుకి రెండు వేపులా ఎవరి ఉపన్యాస దుఖాణం ఎవరి మైకులు వారివే...ఎవరి గర్జనలు వారివే.. ఒక్కోసారి వాళ్ళలో ఎవరేం చెబుతున్నారో కూడా అర్ధం కాక తలగోక్కోక తప్పదు.అంతా కలగాపులగంగా ఉంటుంది.

ఒకచోట రిటైర్డ్ ఉద్యోగులు ...కొంచెం ముందుకు వస్తే ఆశారాం బాపు అనుయాయుల హడావిడి...ఆ పక్కనే పంజాబ్ నుంచి వచ్చిన కొన్ని బృందాలు....ఇంకాముదుకు పోతే చేనే కళాకారుల మీటింగ్...ఆ పక్కనే ఓ పబ్లిక్ రంగ సంస్థ వాళ్ళ ఉపన్యాసం..ఇలా పొద్దు ముందుకు పోతున్న కొద్దీ ఓ మినీ భారత్ అక్కడ తమ కోర్కెల సాధన కోసం ఉద్యమిస్తుంటారు.ఇలా ఆ ప్రాంతమంత హోరెత్తిపోతూ ఉంటుంది."ఆవాజ్ దో..హం ఏక్ హై,కోన్ లడెంగే..హం లడెంగే" ఇలాంటి నినాదాలతో మారుమోగూతూంటుంది.సందట్లో సడేమియా లాగా కోత మంది చిరు వ్యాపారులు తినుబండారాలు,కోట్లు,ఇతర వస్తువులు లాంటివి అక్కడకి తెచ్చి అమ్ముతూ ఆ జనాన్ని సద్వినియోగం చేసుకొంటుంటారు.

కొంతమంది ఫోటోగ్రాఫర్లు వచ్చి ఉపన్యాసాలు వింటున్న జనాల్ని,ప్రసంగిస్తున్న నాయకులని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి ...నిమిషాల వ్యవధి లోనే వాటిల్ని ప్రింట్ వేసి అక్కడే రోడ్డుమీదే ప్రదర్శిస్తుండడం తో  చాలామంది జనాలు కొంటున్నారు.మనం ఎక్కడున్నా ఏదో యాంగిల్ లో తీసిన ఫోటోలో పడితీరుతాం.ఆ తర్వాత ప్రింట్లలో మనల్ని మనం చూసుకుని ఆ టెంప్టేషన్ లో కొనేస్తాం.అదీ వాళ్ళ టెక్నిక్.

ఏమాటకామాట న్యూఢిల్లీ పచ్చదనం తో హాయిగా అందంగా ఉంటుంది. ఆ జంతర్ మంతర్ కి పక్కనే ఉన్న ఒక వీధి పేరు "టాల్స్ టాయ్ స్ట్రీట్". ఒక రష్యన్ రచయిత పేరు మన దేశం లోని ఓ వీధికి పెట్టడం ఆనందమనిపించింది. ఒక వెరైటీ కోసమైన మన తెలుగు ప్రజలు ప్రతి ఊరిలో ఓ రచయిత పేరు పెడితే ఎంతబాగుంటుంది అనిపించింది.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.