Sunday, October 13, 2013

Paulo Coelho రాసిన "అలీఫ్" పుస్తకం పై నా రివ్యూ


Paulo Coelho రాసిన "అలీఫ్" పుస్తకం పై నా రివ్యూపావ్లో కోయిలో పేరుని నేను ఇదివరకు విని ఉన్నాను..ఆయన Alchemist  కూడా బాగాపేరుపొందినది.చాలామంది బాగుందని చదవమని చెప్పారు.కాని నాకున్న ఇతరేతర వ్యాపకాల వల్ల పడలేదు.ఈ మద్య ప్రయాణాల్లో ఓ చోట ఆయన పుస్తకం Aleph కనబడితే కొన్నాను.బ్రెజిల్ లో జన్మించిన పావ్లో మాతృభాష పోర్చుగీస్ .ఆ భాషలోనే ఆయన రచనలు చేశాడు.ఆ తరువాత అవి అనువాదం అవుతుంటాయి ఇతర భాషల్లోకి.నిజం గా ఎంత సౌకర్యం.

ఫ్రెంచ్ గాని,స్పానిష్ గాని,జర్మన్ గాని, స్వీడిష్ గాని, పోర్చుగీస్ గాని ఇంకా ఏ ప్రధాన యూరోపియన్ భాషగాని వాళ్ళ దేశాలు చిన్నవైనా వారి పెద్దలు చేసిన సాహసాల వల్ల అనేక వలస దేశాలు ఏర్పడి ఆయా భాషలకి విస్తృతి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. లేకపోతే ఎక్కడి దక్షిణ అమెరికా ఖండం లోని బ్రెజిల్ అక్కడికి పోర్చుగీస్ భాష వెళ్ళడమేమిటి..?

సరే... రచయిత ఈ అలీఫ్ అనే పేరుని ప్రఖ్యాత బ్రెజిల్ కధకుడు Jorge Luis Borges నుంచి తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ప్రత్యేకమైన ఇతివృత్తం అంటూ ఏమీ లేదు.తనలోకి తాను ప్రయాణించడమే ఈ పుస్తకం లోని సారం.అయితే ఈ  ప్రయాణాన్ని తన రైలు ప్రయాణం తో ముడివేసి చెప్పుకో పోతుంటాడు.ఆఫ్రికా లో నుంచి..అలా యూరపు దేశాల లోకొచ్చి..ఇహ అక్కడినుంచి ట్రాన్స్ సైబీరియా మండలం చివరిదాకా ఎడతెగని రైలు ప్రయాణ అనుభవాలు మననం చేసుకుంటూ మనకి చెబుతాడు.ఇదంతా కూడా రచయిత గా తన పాఠకులని కలుస్తూ చేస్తూంటాడు.కొన్ని వేల మైళ్ళ దూరం ఆ రైలు ప్రయాణం..అరడజను పైగా ప్రామాణిక కాల మండలాలు...మధ్యలో కలిసే హిలాల్ లాంటి పాత్రలు.వాళ్ళతో అనుభవాలు..కొన్ని స్వగతాలు..!

 హిలాల్ అనే ఆవిడతో 500 ఏళ్ళ క్రితం పూర్వ జన్మలో కలిగిన పరిచయం.ప్రస్తుత ఈ జన్మలో ఈమె వయొలనిస్ట్.ఆవిడతో సంభాషణలు...అమలినశృంగారసన్నివేశాలు ..కొండొకచో వాటిని మించి కూడా..!

రచయిత కి జె అనబడే ఒక ఆధ్యాత్మక గురువు ఉన్నట్టు చెబుతాడు.అతడెవరనేదిపూర్తిగా ఎక్కడా చెప్పడు. ఒక రకంగా ఈ పుస్తకాన్ని అతని ఆటోబయోగ్రఫీ గా అనుకోవచ్చునేమో..!చాలా స్లో గా ఉంటుంది కధనమంతా.. మొత్తం మూడు భాగాలుగా విడదీశాడు దీన్నే..!

అయితే చెప్పే విధానంలో మనసుని జోల పుచ్చి నిద్రబుచ్చే టెక్నిక్ పావ్లో లో ఉంది.దాని కోసం ఆయన  వివిధ మతాలకి చెందిన కొన్ని అంశాలని బాగానే పరిశీలించివుండవచ్చు.ఎటువంటి జారత్వం లేకుండానే ఒక మనిషి ఇద్దరిని హృదయం లో కలిగిఉండటం పరిపాటి అంటాడు.ఒకరకంగా పుస్తమంతా అంతర్గత శోధనమే..!

ఈ పుస్తకాన్ని పోర్చుగీస్ లోనుంచి ఇంగ్లీష్ లోకి అనువదించిన Margaret Jull Costa  ని ఎంత అభినందించిన తక్కువే.సరళంగా,భావ యుక్తం గా చాలా బావుంది.తెలుగు లో నుంచి ఇంగ్లీష్ లోకి వచ్చే కొన్ని కధలు చదువుతుంటే ఇంత పాషాణపాకం గా ఎందుకు అనువదిస్తుంటారు..కేవలం వారి పాండితీ ప్రకర్ష చూపడానికేనా అనిపిస్తుంది.Click here

                       --Written by KVVS Murthy


No comments:

Post a Comment

Thanks for your visit and comment.