Friday, July 12, 2013

లక్ష్మి నగరం లో గుర్తు పట్టడానికి వీల్లేకుండా అయిపోయిన ఆ సమాధుల గురించి రాయడం ఇన్నాళ్ళకి కుదురుతోంది.

లక్ష్మి నగరం లో గుర్తు పట్టడానికి వీల్లేకుండా అయిపోయిన ఆ సమాధుల గురించి రాయడం ఇన్నాళ్ళకి కుదురుతోంది.లక్ష్మి నగరం అంటే ఇది భద్రాచలానికి రమారమి ఓ 25 K.m. ఉంటుంది.పర్ణశాలకి వెళుతుంటే మధ్యలో తగులుతుంది. నేను 20 యేళ్ళ క్రితం ఓ దిన పత్రిక లో విలేఖరి గా పనిచేసే టప్పుడు "తెల్ల వాళ్ళ సమాధులు " గురించి జనాలు మాట్లాడు కొంటుంటే ఆసక్తి కొద్ది ఒకళ్ళని అడిగాను.ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దుమ్ముగూడెం పరిసర ప్రాంతాల్లో ఉండేవారని ,వారు చనిపోయింతరవాత లక్ష్మీ నగరం లో సమాధి చేసే వారని..చెప్పారు.చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన వాడిగా యెందుకో ఆ ప్రాంతానికి వెళ్ళాను..! మన వార్త రచనకి కూడా పనికి రావచ్చేమో ననిపించడం ఓ కారణం.

నాలగు గోడల ప్రహరి...ముందు ఓ ఇనుప గేటు...లోపల పిచ్చి మొక్కలు పెరిగాయి.నాకు యెందుకో ఓ గొప్ప చరిత్రే అక్కడ పడుకున్నట్టు తోచింది.మంచి నునుపైన రాళ్ళతో సమాధుల్ని నిర్మించారు.వాటి మీద మృతుల వివరాల్ని కూడా చెక్కారు.నాకు వెళ్ళగానే దారిలో కనిపించిన సమాధిని పరిశీలించాను.దాని పైన రాసిన దాన్ని బట్టి అతడి పేరు "Angus alstair Fernadez" ,అతను ఒక I.C.S. అధికారి.. భద్రాచలం యేజన్సీ కి సబ్ కలక్టర్ మరియు స్పెషల్ యేజంట్  గా పనిచేసినట్టు లిఖించబడి  ఉంది. 1918 ప్రాంతంలో మరణించి నట్టు తెలియజేయబడింది.

దానికి ప్రక్కన Dorothy,sarah clair అనే వాళ్ళ సమాధులు ఉన్నాయి.వాళ్ళు ఉపాధ్యాయినులు.వాటికి ముందు చాల యెత్తుగా ఉన్న సమాధి "Charlotte Henrita" అనే అమ్మాయిది.ఆమె ఆనాటి "Inspector general of Hospitals,Madras" యొక్క కుమార్తె.మరి ఇంత దూరంలో ఇక్కడికి తీసికొచ్చి యెందుకు సమాధి చేశారా అని ఆలోచిస్తే నాకు తోచింది యేమంటే ఇక్కడ వున్న తమ బంధువులు దగ్గరకి వచ్చినప్పుడు మరణించి ఉండవచ్చునేమో ననిపించింది.

ఆర్మీ లో పనిచేసి retire అయిన ఒక వృద్దుణ్ణి అప్పుడు చిన్న interview చేశాను.ఆయన ఇల్లు సమాధుల కి  దగ్గరగానే ఉండేది. ఆ కాలంలో ఇక్కడి దగ్గర్లో ఉన్న దుమ్ముగూడెం navigation work shop గా ఉండి చాలా మంది బ్రిటీష్ జాతీయులతో నిండి వుండేదని చెప్పాడు.తాను చిన్నప్పుడు Dorothy,sarah clair అమ్మ గార్ల వద్దనే చదువు కున్నానని తెలిపాడు. వాళ్ళు పేద ప్రజలకి వుచితంగా చదువు చెప్పి ఉద్యోగాలు కూడా ఇప్పించడంలో సహాయం చేసే వారని యెంతో Thankful గా చెప్పాడు.

ఇటీవల ఆ ప్రాంతం వెళితే గుర్తు పట్టకుండా మారిపోయింది.ప్రహరీ అయితే ఉందిగాని పెద్ద అరణ్యం లా చెట్లు పెరిగిపోయాయి.సమాధుల్ని కూడా యెవరో పెకిలించినట్లుగా అయ్యాయి.మన దేశంలో నివసించిన ప్రతి బ్రిటీష్ వాడు ఒక డయ్యర్ కావాలని యేముంది...ఒక Brown ఉండి వుండవచ్చు...ఒక కాటన్ వుండి వుండవచ్చు.ఆ సమాధుల్ని చారిత్రిక ఆనవాళ్ళుగా పదిల పరిస్తే బాగుంటుంది.

           


ఈ పాత ఫోటో సారా క్లెయిర్ దంపతులది.. మాల్య శ్రీ గారి దగ్గర వుంటే తీసుకొని ఇక్కడ ప్రచురించాను.మిగతా సమాధులన్నీ నేనే ఫోటో తీశాను.అయితే ఓ పది సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు మరీ ఇంతగా శిధిలమవ్వలేదు.  

1 comment:

  1. అద్బుతమైన చారిత్రక సమాచారం.కాలంలొ సమాదులు మాయమైనా,మీక్రుషివల్ల అవి అంథర్జాలంలొ శాస్వతంగా మిగిలిపొతాయి.అభినంధనలు.

    ReplyDelete

Thanks for your visit and comment.